Monday, 28 January 2013

Viswaroopam Movie Review


12

చిత్రం పేరు     : ‘విశ్వరూపం’
విడుదల తేదీ  : 25.01.2013
దర్శకుడు      : కమల్ హాసన్
నిర్మాత        : కమల్ హాసన్, చంద్ర హాసన్
సంగీతం        : శంకర్ – ఎహాసన్ – లాయ్
నటీనటులు    : కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్
తెలుగువిశేష్.కాం రేటింగ్ :3.5
పరిచయం :
     వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ధరించి మెప్పుపొందిన లోకనాయకుడు కమల్ హాసన్. ఇప్పుడు 11వ అవతారమెత్తి.. వెండితెర వెనుక దర్శకుడిగా కథ నడిపించి, చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మాత బాధ్యతలు భుజానవేసుకుని నిర్మించి... తన ‘విశ్వరూపం’ ప్రదర్శించాడు. అయితే ఈ  క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఆటుపోట్లు.. చిత్రం ప్రారంభించిన తొలినాళ్ల నుంచీ ఎన్నో అవరాధోలు అధిగమిస్తూ మొత్తానికి రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఇంతలో డిటిహెచ్ ప్రసారాల సమస్య, సరే.. దీనినుంచి ఏదోరకంగా గట్టెక్కాడంటే విడుదలకు ఒకరోజు ముందు పిడుగుపాటు లాంటి నిషేదం వార్త.. అనంతరం కోర్టు మెట్లెక్కిన ఈ మూవీ మొత్తానికి ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమల్ కెరీర్ లోనే అత్యంత విలువైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో.. ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతమేరకు చూరగొందో ఇప్పుడు చూద్దాం..
vis
చిత్రకథ :       
       ఆఫ్ఘనిస్థాన్ లోని తాలీబాన్ తీవ్రవాదుల చేష్టల సమాహారం ఈ కమల్ విశ్వరూపం. కథేంటంటే.. కమల్ హాసన్(విశ్వనాథ్) అమెరికాలోని న్యూయార్క్ లో నివసిస్తుంటాడు. ఆయన భార్య పూజ కుమార్(నిరుపమ) డాక్టర్ గా విధులు నిర్వహిస్తుంటుంది. కథక్ నృత్య శిక్షకుడుగా పనిచేసే విశ్వనాథ్ తన దగ్గరికి వచ్చే అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటూ ఉంటాడు. ఆ అమ్మాయిల్లో ఆండ్రియా ఒకరు. దీంతో విశ్వనాథ్ భార్య డాక్టర్ నిరుపమ తన భర్త క్యారెక్టర్ పై అనుమానం పెంచుకుంటుంది. ఈ వ్యవహారం తేల్చుకునేందుకు ఓ డిటెక్టివ్‌ను నియమిస్తుంది. ఈ క్రమంలో ఏజెంట్ ఇచ్చిన సమాచారంలో విస్తుగొలిపే నిజాలు వెలుగుచూస్తాయి. అసలు.. విశ్వనాధ్ హిందూ కాదని ముస్లిం అని వెల్లడవుతుంది. ఈ  క్రమంలో డిటెక్టివ్ ఏజెంట్ ముస్లిం టెర్రరిస్ట్ రాహుల్ బోస్ (ఒమర్)కి దొరికిపోయి ఆల్ ఖైదా గ్రూపు టెర్రరిస్టులచే చంపబడతాడు. అంతేకాదు ఆల్ ఖైదా ఉగ్రవాదులు న్యూయార్కులో న్యూక్లియర్ బాంబు పేల్చేందుకు ప్లాన్ చేస్తున్నారనీ బయటకు లీక్ అవుతుంది.
        చివరికి.. విశ్వనాథ్ ఎవరు.. అతని లక్ష్యం ఏమిటి.. అతను మంచోడా, క్రూరుడా వంటి ట్విస్ట్ లను వెండితెరమీదే చూడాలి.
విశ్లేషణ :
        దాదాపు 3 సంవత్సరాల విరామం తర్వాత కమల్ విశ్వరూపం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘విశ్వరూపం' చిత్రాన్ని కమల్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నిర్మించడంతో పాటు ఇందులో హీరోగా చేసాడు. తొలినాళ్లలో సెల్వరాఘవన్ దర్శకుడిగా ఈ సినిమా మొదలు పెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల సెల్వరాఘవన్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను భుజానేసుకున్నారు కమల్ హాసన్. విశ్వరూపం చిత్రం తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి రూపొందించారు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 95 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. కాగా విలక్షణ నటుడు కమల్ ఈ మూవీలో తన నటనావిశ్వరూపాన్ని సాక్షాత్కరించాడనే చెప్పాలి. నటుడిగా ఆయన ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలో కనిపించారు. డాన్స్ టీచర్ పాత్రలో నవ్వులు కురిపించి ముస్లిం పాత్రలో ఒదిగిపోయాడు. విశ్వనాధ్ భార్యగా పూజ కుమార్ నవ్విస్తూ చివరి వరకూ తన ప్రాధాన్యాన్ని చాటింది. ఆమె పాత్రకి చెప్పిన డబ్బింగ్ ఆకట్టుకుంటుంది. హిందీ నటుడు రాహుల్ బోస్ ప్రతి నాయకుడి పాత్రలో భయపెట్టాడు. జైదీప్ అహ్లావత్ ఒమర్ అనుచరుడు సల్మాన్ గా కీలక పాత్ర చేసాడు. శేఖర్ కపూర్, నాజర్ పరిమితి గల పాత్రల్లో కనిపించి పర్వాలేదనిపించారు.        
       సినిమా నెమ్మదిగా ప్రారంభం అయినా...కథలో గ్రిప్ ఉంది. సినిమా తొలి భాగం మొత్తం యూఎస్ లోనే షూట్ చేసారు. తొలి 20 నిముషాలు పాత్రలను పరిచయం చేస్తూ ఆ తరువాత కామెడీ పండిస్తూ ఆసక్తికరంగా కథనం సాగింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆర్మీ ఎటాక్ సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. సెకండ్ హాఫ్ లో మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వాడుకుంటూ కథనం వేగంగా పరిగెత్తించాడు. ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల్లో చూపించే టెర్రరిస్ట్ సన్నివేశాలు రక్తికట్టాయి. తొలి భాగం చూస్తే సెకండాఫ్ ఏమిటి? అనే దానిపై ఉత్సుకత పెరిగేలా కథ నడిపించాడు. సెకండ్ హాఫ్ హాలీవుడ్ సినిమాని గుర్తుకుతెచ్చింది.
సాంకేతికవర్గం :
       సను జాన్ సినిమాటోగ్రఫీ అద్భుతం. మహేష్ నారాయణ్ ఎడిటింగ్ బావుంది. పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ యుద్ధ ప్రాంతాల సెట్స్ ని ఆర్ట్ విభాగం బాగా తీర్చిదిద్దింది. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం ఓకే.  అణు వినాశ, తుపాకి పాటల చిత్రీకరణ బావుంది. అన్ని విభాగాల్లో హై క్వాలిటీ వాల్యూస్ ఉన్నాయి.

ముగింపు :
        అష్టకష్టాలు పడి మొత్తానికి కమల్ హాసన్ విశ్వరూపం సందర్శన యోగం కలిగించాడు.
...avnk

 

Thursday, 10 January 2013

Seethamma Vakitlo Sirimalle Chettu Review

s
 

సినిమా పేరు : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘
విడుదల తేదీ : 11 జనవరి 2013
దర్శకుడు : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : మిక్కి జె మేయర్
నటీనటులు : వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.5
ss
పరిచయం :
       దాదాపు పాతికేళ్ల తర్వాత తెలుగు సినిమా చరిత్రలో టాప్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’. సంక్రాంతి సంబరాల ఆరంభంవేళ.. ఇవాళే ప్రపంచ వ్యాప్తంగా వెండితరలను తాకింది. ఈ సినిమా గురించి విశ్లేషించుకునే ముందు ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాలి. ముఖ్యంగా మహేష్ బాబు గురించి. ఈ టాప్ హీరోని ఫ్యాన్సేకాదు, సగటు ప్రేక్షకుడు కూడా ఓ రేంజ్ లో ఊహంచుకుంటాడు. (పోకిరి, బిజినెస్ మేన్) ఇలా..
        ఇక వెంకీ పవర్ ఫుల్ రోల్స్ ఎలా ఉంటాయో (లక్ష్మీ, తులసి..) మనకెరుకే. ఇవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా చూడాలని ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో చిత్ర ప్రధాన తారాగణం, దర్శకనిర్మాతల సూచన మనసులో ఉంచుకుని థియేటర్ కి వెళ్లటం సబబనిపించుకుంటుంది. ఏవిధమైన ఎక్సెపెక్టేషన్స్ లేకుండా, అదే బ్లాంక్ మైండ్ తో థియేటర్ కెళ్లి,  సినిమా చూసి ఈ సమీక్ష మీకందిస్తున్నాం..
       ఎందుకంటే.. మెకానికల్ జీవితంలో సంబంధబాంధవ్యాలు అడుగంటిపోతోన్న ఈ తరుణంలో ఓ చక్కటి పూర్తి స్థాయి కుటుంభ కథా చిత్రాన్ని, అదీ భారీ తారాగణంతో తీసి.. తెలుగువారి సంప్రదాయాలని తెలియజెప్పే ఈ సాహసోపేత ప్రయత్నానికి అంతా  తోడ్పాటునివ్వాలికదా.. ఏమంటారు... ఇక కథ విషయానికొద్దాం...

చిత్రకథ :
       రేలంగి అనే గ్రామంలోని ఓ అందమైన కుటుంభం కథ ఇది.  రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్మలు పెద్దోడు(వెంకటేష్), చిన్నోడు(మహేష్ బాబు). వారి తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్(రేలంగి మావయ్య), జయసుధ. ఆ గ్రామ వాస్తవ్యుడైన ప్రకాష్ రాజ్ మంచి మనిషి, ఎవరిని నొప్పించని పరోపకారి. ఆయనంటే ఆఊరిలో అందరికీ ఎంతోగౌరవం. అతని పుత్రరత్నాల్లో  పెద్దోడు తనకు నచ్చినట్లుగా ఉండే మనస్తత్వం కలవాడు, ఎవరెన్ని చెప్పినా వినే టైప్ కాదు. చిన్నోడు మాత్రం పరిస్థితులకు అనుగుణంగా మేనేజ్ చేసే రకం. ఇద్దరు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతుంటారు.
    ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మేనకోడలు అయిన సీత(అంజలి) తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రకాష్ రాజ్ ఇంట్లోనే పెరుగుతుంది. ఆమెను పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేయాలని కుటుంభమంతా భావిస్తుంది. ఇక చిన్నోడు గీత(సమంత) ప్రేమ లో పడతాడు. కోటీశ్వరుడైన రావురమేష్ కూతురే ఈ గీత. అయితే నవీనపోకడలంటే ఎక్కువ మక్కువ చూపే రావు రమేష్ కి ప్రకాష్ రాజ్ కుటుంబం తీరు నచ్చదు. పెద్దోడు, చిన్నోడు నిరుద్యోగులుగా ఉండటం కూడా రావురమేష్ కి సుఖించని అంశం. ఈ కారణంతో ప్రకాష్ రాజ్ ఫ్యామిలీతో వియ్యానికి ఇష్టపడడు.
        ఇలా ముందుకుసాగుతోన్న కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి చెల్లి పెల్లిలో చిన్నోడు, పెద్దోడు మధ్య మనస్ఫర్థలు మొదలవుతాయి. ఎంతో అన్నోన్యంగా సాగుతోన్న ఈ కుటుంభంలో కలతలకు ఎవరుకారణం... ఇవి ఎలా సమసిపోతాయి. అనుకున్నట్టుగానే చిన్నోడు, పెద్దోడుల వివాహాలు జరుగుతాయా అనేదే చిత్రంలోని కీలకాంశం.

విశ్లేషణ :
       మొదటగా నిర్మాత దిల్ రాజు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అభినందనీయులు. ఎందుకంటే, ఒక మంచి తెలుగింటి సినిమా కోసం వెంకటేష్, మహేష్ బాబు ని ఒకే తెర మీదకు తీసుకురావడం.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ సినిమాని రూపొందించినందుకు.  ఇక నటీనటుల అభినయం గురించి చెప్పాలంటే,  వెంకటేష్ పాత్ర ఎమోషనల్ గా రక్తికట్టింది. సాధారణంగా ఇటువంటి సన్నివేశాలలో అద్భుతంగా నటించే వెంకీ,  అంజలి తో వచ్చే సన్నివేశాలకు ప్రాణం పోశాడు. మహేష్ బాబు తుంటరి తమ్ముడి పాత్రలో, గోదావరి స్లేంగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. మంచి టైమింగ్ ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. సమంత - మహేష్ బాబు  రొమాంటిక్ సీన్స్ బాగా పండాయి. భద్రాచలంలో వెంకటేష్ మరియు మహేష్ బాబు మధ్య కెమిస్ట్రీ అదిరింది. ఇక అంజలి అమాయిక పాత్రలో  సీతమ్మను తలపించింది. సమంత చాలా అందం, అభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుతో  రొమాన్స్ లో తానేంటో నిరూపించింది. జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో తనదైన శైలి కనబరిచారు. జయసుధ, రావు రమేష్ , మురళి మోహన్, రోహిణి ,రవిబాబు, తనికెళ్ళ భరణి వారి వారి పరిధిమేరకు నటించిమెప్పించారు.
         సినిమాలో ముఖ్యంగా  అన్నదమ్ముల మధ్య బంధాన్ని.. తన మేనకోడలి మీద మామయ్యకి ఉన్న ప్రేమ, కొడుకు – తల్లి మధ్య అనురాగం మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటాయో బాగా తెరకెక్కించారు. ఫస్టాఫ్  మొత్తం మంచి వేగంగా సాగుతుంది. సెకండాఫ్ లో కథనం కాస్త మందగించినట్టు అనిపిస్తుంది. ఇక సాంగ్స్ విషయానికొస్తే  అన్ని పాటలను చాలా హ్రుద్యంగా తెరకెక్కించారు. వెంకీ-మహీ ఒకరిపైఒకరికి గల ప్రేమను చెప్పకనే చెప్పిన సన్నివేశం అందరి హ్రుదయాలను హత్తుకుంటుంది. ఆద్యంతం కథనం బోర్ కొట్టించకుండా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రక్తికట్టించాడనే చెప్పాలి.

సాంకేతిక విభాగం :
      ఇద్దరు పెద్ద హీరోలను హ్యాండిల్ చేయటం కత్తిమీద సమనే చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దహీరోలతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కించటంలో విజయం సాధించాడు.  సినిమాటోగ్రఫీ విషయంలో గుహన్ వందమార్కులు కొట్టేశాడు. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్ గా గుహన్ చిత్రీకరించాడు. ఆడియో రిలీజ్ తర్వాత  మిక్కీ జె మేయర్ పనితనం అందరికీ తెలిసిపోయింది, దీనికి ఏమాత్రం తగ్గకుండా సినిమాలోనూ సంగీతం చాలా ఆహ్లాదంగా ఉంది. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం సినిమాకి వెన్నెముకలా నిలిచింది.  ఎడిటింగ్  బాగుంది.   డైలాగ్స్ సందర్భోచితంగా ఉన్నాయి. క్వాలిటీ ఔట్ ఇవ్వటంలో టెక్కికల్ టీం చాలా శ్రద్ద తీసుకున్నట్టు కనిపించింది.
ముగింపు :

       ప్రతీ తెలుగువారింటా రంగవల్లులు కొలువుతీరే పెద్దపండుగ వేళ రావాల్సిన.. కుటుంభ సమేతంగా చూడాల్సిన... ఆప్యాయతానురాగాల సమాహారం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.

...avnk

Wednesday, 9 January 2013

Naayak Review

Nayak-Poster-eeee
సినిమాపేరు : ‘నాయక్’
విడుదల తేదీ : 09 జనవరి 2013
దర్శకుడు : వి.వి. వినాయక్
నిర్మాత : డి. వి. వి. దానయ్య
సంగీతం : తమన్
నటీనటులు : రామ్ చరణ్, కాజల్, అమలా పాల్…
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.75
పరిచయం :
        ఒక పవర్ ఫుల్ హీరో వారసుడు రాంచరణ్.. మరొకరు సక్సెస్ ఫుల్ డైరక్టర్ వి.వి.వినాయక్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నాయక్. కొద్దిసేపటిక్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాంచరణ్ తన కెరీర్ లో తొలిసారిగా ద్విపాత్రిభినయం చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు వచ్చింది. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ప్రత్యేకంగా ఈ చిత్ర ప్రీమియర్ ప్రదర్శించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీలో  కాజల్, అమల పాల్ కథానాయికలుగా నటించారు. చరణ్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు  సమీక్షిద్దాం..

చిత్రకథ :
      రామ్ చరణ్ (చెర్రీ) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని అంకుల్ బ్రహ్మానందం (జిలేబి) లోకల్ డాన్ అయిన రాహుల్ దేవ్  (గండిపేట బాబ్జి) తో తగవు పడతాడు. ఈ ఉపద్రవంనుంచి అంకుల్ ని కాపాడే క్రమంలో బాబ్జి చెల్లెలు కాజల్ (మధు) తో ప్రేమలో పడతాడు చెర్రీ. మరోవైపు, హైదరాబాద్, కోల్ కలత్తాలో వరుస హత్యలు జరుగుతుంటాయి.  మినిస్టర్ రావత్ ని చెర్రీ చంపేయబోతున్నాడని ఇంటెలిజన్స్ నివేదికలు రావటంతో సిబిఐ అధికారి (ఆశిష్ విద్యార్థి) చెర్రీ కోసం గాలిస్తుంటాడు. ఇక్కడే  కథలో అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ ట్విస్ట్స్ ఏంటన్నది తెరమీదే చూడాలి.

విశ్లేషణ :
        ఫస్టాఫ్ యమస్పీడుగా సాగింది. మంచి కామెడీతోపాటు వినోదాత్మకంగా నడిచింది. యాక్షన్ అంశాలు కూడా సమపాళ్లలో ఉన్నాయి. ఇక సెకండాఫ్ స్టార్టింగ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు, హింస పెచ్చరిల్లింది. అనంతరం పోసాని ఎంట్రీతో మళ్లీ ఆహ్లాదకరవాతావరణం వచ్చింది. ‘కత్తి లాంటి పిల్ల’, ‘ఒక చూపుకే పడిపోయా’ చిత్రీకరణ చాలా బాగుంది. ఇక చిరు రీమిక్స్ సాంగ్ ‘శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో’ అంత బాగా వచ్చినట్టు తోచలేదు. ఇంకాచెప్పాలంటే కథ పాతదిలా అనిపించినా కథనాన్ని వినాయక్ ఆసక్తికరంగా నడిపించాడు. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ పెద్దగా ఆసక్తి రేకిత్తించలేదు. మసాలాకోసం కొన్ని అంశాలు కథలో చొప్పించినట్టు గోచరిస్తుంది. ద్వితీయార్ధంలో  మితిమీరిన హింస, వేగం మందగించటం, క్లైమాక్స్ అనుకున్నంతగా లేదనే ఫీలింగ్ నెగిటివ్ అంశాలుగా చెప్పొచ్చు.

నటీనటుల పనితీరు :
        మెగాపవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న రామ్ చరణ్ ఈ సినిమాలో మరింత పరిణితి కనబరిచాడు. నటన, అభినయం అద్భుతం. వాయిస్ మొడ్యులేషన్ బాగా మెరుగైంది. డాన్స్ ఇరగదీసాడు. ‘లైలా ఓ లైలా’, ‘హే నాయక్’ లో చర్రీ ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందంతోనూ, అభినయంతోనూ పాటలతోపాటు, అన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది.  మరో హీరోయిన్  అమలా పాల్ పాత్ర పరిధి చిన్నదైనప్పటికీ, మంచిమార్కులు కొట్టేసింది.  ఇంపార్టెంట్ రోల్ లో  బ్రహ్మానందం జిలేబి వంటి రుచికర వంటకాన్ని వండి వడ్డించాడు.  ఈ చిత్రంలో బ్రహ్మీ హావభావాలు రవితేజ క్రిష్ణ సినిమాను గుర్తుకుతెచ్చాయి. ఇక పోసాని క్రుష్ణంవందే జగద్గురుమ్ సినిమాతర్వాత మరో మంచి రోల్ పోషించారు.  కోల్ కత్తా లో క్రిమినల్ గా సూపర్ కామెడీ టైమింగ్ ఇచ్చాడు. ఇంకా,  ఎం ఎస్ నారాయణ సి.బి.ఐలో తాగుబోతు లిప్ రీడింగ్ స్పెషలిస్ట్ గా కడుపుబ్బా నవ్వించాడు. విలన్ రాహుల్ దేవ్ కి పెద్దన్నగా జయప్రకాశ్ రెడ్డి నిండుకుండలా నటించాడు.

సాంకేతికవిలువలు :
        సినిమాటోగ్రఫీ కోసం చోటా కె నాయుడు ని ఎందరూ ఎందుకు కోరుకుంటారో తెలిపేందుకు ఈ సినిమా ఓ ఇండెక్స్. ఐస్ ల్యాండ్ లో అద్భుతంగా చిత్రీకరించిన పాటలు అతని పనితనానికి మచ్చుతునకల్లా అనిపించాయి. దాదాపు అన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయ్.  కమెడియన్స్ కి రాసిన  డైలాగ్స్ అయితే చెప్పనక్కరలేదు సందేశాత్మకమే కాదు, ఆలోచనాత్మకంకూడా. ఎడిటింగ్ ఓకే. ఫైట్స్ విషయంలో చాలా కొత్తదనం కనిపించింది. డ్యాన్స్ విషయానికొస్తే దాదాపు అన్ని పాటల్లోనూ కొత్తదనం కనిపించింది. ఇక దర్శకుడు వి వి వినాయక్ సినిమాలు చూడటానికి ఆలోచించనక్కరలేదు అన్న నానుడికి ఈ సినిమా మరింత బలం చేకూరుస్తుంది. మాస్ పల్స్ వివి కి బాగా తెలుసు. కథ ఎలాంటిదైనా కథనాన్ని శరవేగంగా నడిపి, వినోదాత్మకంగా సినిమాని రక్తికట్టించగలనని మరోసారి వినాయక్ నిరూపించాడు ఈ సినిమాతో.

ఉపసంహారం :
       2013 ఫస్ట్ హిట్ మూవీ గా ‘నాయక్’ నిలుస్తుంది. ఈ పెద్దపండుగకు వెంకీ - మహేష్ ల శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ కుటుంభంలోని ఆప్యాయతా అనురాగాలతో ఆహ్లాదకరవాతావరణాన్ని అందించబోతోంటే, చరణ్ – వివి వినాయక్ ల ‘నాయక్’ పూర్తి స్థాయి మాస్ మషాలా అందించింది.
...avnk










Friday, 4 January 2013

Sevakudu Movie Review

see
    
          శ్రీకాంత్, ఛార్మి నాయకా నాయికలుగా నటించిన ‘సేవకుడు‘ చిత్రం జనవరి 4న (నేడే) విడుదలైంది. కథ విషయానికొస్తే,  హెడ్ కానిస్టేబుల్ అయిన ఒక తండ్రి అన్యాయాలతో నిండిన వ్యవస్థను మార్చాలనుకుంటాడు. అతని వల్ల కాని పనిని తన కుమారునితో చేయించాలనుకుంటాడు. ఐతే పోలీస్ వ్యవస్థ మారితేనే గానీ సమాజం మారదంటాడు హీరో సూర్యం. అన్యాయం, అవినీతిపై అతను ఏ విధంగా పోరాడాడనేదే కథ. నిజ జీవితంలో జరిగే సంఘటనలన్నీ ఈ చిత్రానికి స్ఫూర్తి.

       ‘సేవకుడు’గా శ్రీకాంత్ నటన, అతని సహాయకురాలిగా ఛార్మి పెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్. కృష్ణ, ఆయన కుమార్తె మంజుల తండ్రీ కూతుళ్లుగా నటించటం చిత్రానికి మరో ఆకర్షణ. శ్రీకాంత్ తండ్రి పాత్రలో నాజర్ నటన.. సేవకుడు అనే టైటిల్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ‘పోకిరి’ చిత్రంలో మహేష్‌బాబు డైలాగ్‌లు ఈ చిత్రంలో కృష్ణ గారు చెప్పడం మరో హైలైట్.