Wednesday, 9 January 2013

Naayak Review

Nayak-Poster-eeee
సినిమాపేరు : ‘నాయక్’
విడుదల తేదీ : 09 జనవరి 2013
దర్శకుడు : వి.వి. వినాయక్
నిర్మాత : డి. వి. వి. దానయ్య
సంగీతం : తమన్
నటీనటులు : రామ్ చరణ్, కాజల్, అమలా పాల్…
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.75
పరిచయం :
        ఒక పవర్ ఫుల్ హీరో వారసుడు రాంచరణ్.. మరొకరు సక్సెస్ ఫుల్ డైరక్టర్ వి.వి.వినాయక్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నాయక్. కొద్దిసేపటిక్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాంచరణ్ తన కెరీర్ లో తొలిసారిగా ద్విపాత్రిభినయం చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు వచ్చింది. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ప్రత్యేకంగా ఈ చిత్ర ప్రీమియర్ ప్రదర్శించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీలో  కాజల్, అమల పాల్ కథానాయికలుగా నటించారు. చరణ్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు  సమీక్షిద్దాం..

చిత్రకథ :
      రామ్ చరణ్ (చెర్రీ) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని అంకుల్ బ్రహ్మానందం (జిలేబి) లోకల్ డాన్ అయిన రాహుల్ దేవ్  (గండిపేట బాబ్జి) తో తగవు పడతాడు. ఈ ఉపద్రవంనుంచి అంకుల్ ని కాపాడే క్రమంలో బాబ్జి చెల్లెలు కాజల్ (మధు) తో ప్రేమలో పడతాడు చెర్రీ. మరోవైపు, హైదరాబాద్, కోల్ కలత్తాలో వరుస హత్యలు జరుగుతుంటాయి.  మినిస్టర్ రావత్ ని చెర్రీ చంపేయబోతున్నాడని ఇంటెలిజన్స్ నివేదికలు రావటంతో సిబిఐ అధికారి (ఆశిష్ విద్యార్థి) చెర్రీ కోసం గాలిస్తుంటాడు. ఇక్కడే  కథలో అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ ట్విస్ట్స్ ఏంటన్నది తెరమీదే చూడాలి.

విశ్లేషణ :
        ఫస్టాఫ్ యమస్పీడుగా సాగింది. మంచి కామెడీతోపాటు వినోదాత్మకంగా నడిచింది. యాక్షన్ అంశాలు కూడా సమపాళ్లలో ఉన్నాయి. ఇక సెకండాఫ్ స్టార్టింగ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు, హింస పెచ్చరిల్లింది. అనంతరం పోసాని ఎంట్రీతో మళ్లీ ఆహ్లాదకరవాతావరణం వచ్చింది. ‘కత్తి లాంటి పిల్ల’, ‘ఒక చూపుకే పడిపోయా’ చిత్రీకరణ చాలా బాగుంది. ఇక చిరు రీమిక్స్ సాంగ్ ‘శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో’ అంత బాగా వచ్చినట్టు తోచలేదు. ఇంకాచెప్పాలంటే కథ పాతదిలా అనిపించినా కథనాన్ని వినాయక్ ఆసక్తికరంగా నడిపించాడు. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ పెద్దగా ఆసక్తి రేకిత్తించలేదు. మసాలాకోసం కొన్ని అంశాలు కథలో చొప్పించినట్టు గోచరిస్తుంది. ద్వితీయార్ధంలో  మితిమీరిన హింస, వేగం మందగించటం, క్లైమాక్స్ అనుకున్నంతగా లేదనే ఫీలింగ్ నెగిటివ్ అంశాలుగా చెప్పొచ్చు.

నటీనటుల పనితీరు :
        మెగాపవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న రామ్ చరణ్ ఈ సినిమాలో మరింత పరిణితి కనబరిచాడు. నటన, అభినయం అద్భుతం. వాయిస్ మొడ్యులేషన్ బాగా మెరుగైంది. డాన్స్ ఇరగదీసాడు. ‘లైలా ఓ లైలా’, ‘హే నాయక్’ లో చర్రీ ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందంతోనూ, అభినయంతోనూ పాటలతోపాటు, అన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది.  మరో హీరోయిన్  అమలా పాల్ పాత్ర పరిధి చిన్నదైనప్పటికీ, మంచిమార్కులు కొట్టేసింది.  ఇంపార్టెంట్ రోల్ లో  బ్రహ్మానందం జిలేబి వంటి రుచికర వంటకాన్ని వండి వడ్డించాడు.  ఈ చిత్రంలో బ్రహ్మీ హావభావాలు రవితేజ క్రిష్ణ సినిమాను గుర్తుకుతెచ్చాయి. ఇక పోసాని క్రుష్ణంవందే జగద్గురుమ్ సినిమాతర్వాత మరో మంచి రోల్ పోషించారు.  కోల్ కత్తా లో క్రిమినల్ గా సూపర్ కామెడీ టైమింగ్ ఇచ్చాడు. ఇంకా,  ఎం ఎస్ నారాయణ సి.బి.ఐలో తాగుబోతు లిప్ రీడింగ్ స్పెషలిస్ట్ గా కడుపుబ్బా నవ్వించాడు. విలన్ రాహుల్ దేవ్ కి పెద్దన్నగా జయప్రకాశ్ రెడ్డి నిండుకుండలా నటించాడు.

సాంకేతికవిలువలు :
        సినిమాటోగ్రఫీ కోసం చోటా కె నాయుడు ని ఎందరూ ఎందుకు కోరుకుంటారో తెలిపేందుకు ఈ సినిమా ఓ ఇండెక్స్. ఐస్ ల్యాండ్ లో అద్భుతంగా చిత్రీకరించిన పాటలు అతని పనితనానికి మచ్చుతునకల్లా అనిపించాయి. దాదాపు అన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయ్.  కమెడియన్స్ కి రాసిన  డైలాగ్స్ అయితే చెప్పనక్కరలేదు సందేశాత్మకమే కాదు, ఆలోచనాత్మకంకూడా. ఎడిటింగ్ ఓకే. ఫైట్స్ విషయంలో చాలా కొత్తదనం కనిపించింది. డ్యాన్స్ విషయానికొస్తే దాదాపు అన్ని పాటల్లోనూ కొత్తదనం కనిపించింది. ఇక దర్శకుడు వి వి వినాయక్ సినిమాలు చూడటానికి ఆలోచించనక్కరలేదు అన్న నానుడికి ఈ సినిమా మరింత బలం చేకూరుస్తుంది. మాస్ పల్స్ వివి కి బాగా తెలుసు. కథ ఎలాంటిదైనా కథనాన్ని శరవేగంగా నడిపి, వినోదాత్మకంగా సినిమాని రక్తికట్టించగలనని మరోసారి వినాయక్ నిరూపించాడు ఈ సినిమాతో.

ఉపసంహారం :
       2013 ఫస్ట్ హిట్ మూవీ గా ‘నాయక్’ నిలుస్తుంది. ఈ పెద్దపండుగకు వెంకీ - మహేష్ ల శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ కుటుంభంలోని ఆప్యాయతా అనురాగాలతో ఆహ్లాదకరవాతావరణాన్ని అందించబోతోంటే, చరణ్ – వివి వినాయక్ ల ‘నాయక్’ పూర్తి స్థాయి మాస్ మషాలా అందించింది.
...avnk










No comments:

Post a Comment