Thursday, 10 January 2013

Seethamma Vakitlo Sirimalle Chettu Review

s
 

సినిమా పేరు : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘
విడుదల తేదీ : 11 జనవరి 2013
దర్శకుడు : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : మిక్కి జె మేయర్
నటీనటులు : వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.5
ss
పరిచయం :
       దాదాపు పాతికేళ్ల తర్వాత తెలుగు సినిమా చరిత్రలో టాప్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’. సంక్రాంతి సంబరాల ఆరంభంవేళ.. ఇవాళే ప్రపంచ వ్యాప్తంగా వెండితరలను తాకింది. ఈ సినిమా గురించి విశ్లేషించుకునే ముందు ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాలి. ముఖ్యంగా మహేష్ బాబు గురించి. ఈ టాప్ హీరోని ఫ్యాన్సేకాదు, సగటు ప్రేక్షకుడు కూడా ఓ రేంజ్ లో ఊహంచుకుంటాడు. (పోకిరి, బిజినెస్ మేన్) ఇలా..
        ఇక వెంకీ పవర్ ఫుల్ రోల్స్ ఎలా ఉంటాయో (లక్ష్మీ, తులసి..) మనకెరుకే. ఇవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా చూడాలని ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో చిత్ర ప్రధాన తారాగణం, దర్శకనిర్మాతల సూచన మనసులో ఉంచుకుని థియేటర్ కి వెళ్లటం సబబనిపించుకుంటుంది. ఏవిధమైన ఎక్సెపెక్టేషన్స్ లేకుండా, అదే బ్లాంక్ మైండ్ తో థియేటర్ కెళ్లి,  సినిమా చూసి ఈ సమీక్ష మీకందిస్తున్నాం..
       ఎందుకంటే.. మెకానికల్ జీవితంలో సంబంధబాంధవ్యాలు అడుగంటిపోతోన్న ఈ తరుణంలో ఓ చక్కటి పూర్తి స్థాయి కుటుంభ కథా చిత్రాన్ని, అదీ భారీ తారాగణంతో తీసి.. తెలుగువారి సంప్రదాయాలని తెలియజెప్పే ఈ సాహసోపేత ప్రయత్నానికి అంతా  తోడ్పాటునివ్వాలికదా.. ఏమంటారు... ఇక కథ విషయానికొద్దాం...

చిత్రకథ :
       రేలంగి అనే గ్రామంలోని ఓ అందమైన కుటుంభం కథ ఇది.  రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్మలు పెద్దోడు(వెంకటేష్), చిన్నోడు(మహేష్ బాబు). వారి తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్(రేలంగి మావయ్య), జయసుధ. ఆ గ్రామ వాస్తవ్యుడైన ప్రకాష్ రాజ్ మంచి మనిషి, ఎవరిని నొప్పించని పరోపకారి. ఆయనంటే ఆఊరిలో అందరికీ ఎంతోగౌరవం. అతని పుత్రరత్నాల్లో  పెద్దోడు తనకు నచ్చినట్లుగా ఉండే మనస్తత్వం కలవాడు, ఎవరెన్ని చెప్పినా వినే టైప్ కాదు. చిన్నోడు మాత్రం పరిస్థితులకు అనుగుణంగా మేనేజ్ చేసే రకం. ఇద్దరు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతుంటారు.
    ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మేనకోడలు అయిన సీత(అంజలి) తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రకాష్ రాజ్ ఇంట్లోనే పెరుగుతుంది. ఆమెను పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేయాలని కుటుంభమంతా భావిస్తుంది. ఇక చిన్నోడు గీత(సమంత) ప్రేమ లో పడతాడు. కోటీశ్వరుడైన రావురమేష్ కూతురే ఈ గీత. అయితే నవీనపోకడలంటే ఎక్కువ మక్కువ చూపే రావు రమేష్ కి ప్రకాష్ రాజ్ కుటుంబం తీరు నచ్చదు. పెద్దోడు, చిన్నోడు నిరుద్యోగులుగా ఉండటం కూడా రావురమేష్ కి సుఖించని అంశం. ఈ కారణంతో ప్రకాష్ రాజ్ ఫ్యామిలీతో వియ్యానికి ఇష్టపడడు.
        ఇలా ముందుకుసాగుతోన్న కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి చెల్లి పెల్లిలో చిన్నోడు, పెద్దోడు మధ్య మనస్ఫర్థలు మొదలవుతాయి. ఎంతో అన్నోన్యంగా సాగుతోన్న ఈ కుటుంభంలో కలతలకు ఎవరుకారణం... ఇవి ఎలా సమసిపోతాయి. అనుకున్నట్టుగానే చిన్నోడు, పెద్దోడుల వివాహాలు జరుగుతాయా అనేదే చిత్రంలోని కీలకాంశం.

విశ్లేషణ :
       మొదటగా నిర్మాత దిల్ రాజు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అభినందనీయులు. ఎందుకంటే, ఒక మంచి తెలుగింటి సినిమా కోసం వెంకటేష్, మహేష్ బాబు ని ఒకే తెర మీదకు తీసుకురావడం.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ సినిమాని రూపొందించినందుకు.  ఇక నటీనటుల అభినయం గురించి చెప్పాలంటే,  వెంకటేష్ పాత్ర ఎమోషనల్ గా రక్తికట్టింది. సాధారణంగా ఇటువంటి సన్నివేశాలలో అద్భుతంగా నటించే వెంకీ,  అంజలి తో వచ్చే సన్నివేశాలకు ప్రాణం పోశాడు. మహేష్ బాబు తుంటరి తమ్ముడి పాత్రలో, గోదావరి స్లేంగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. మంచి టైమింగ్ ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. సమంత - మహేష్ బాబు  రొమాంటిక్ సీన్స్ బాగా పండాయి. భద్రాచలంలో వెంకటేష్ మరియు మహేష్ బాబు మధ్య కెమిస్ట్రీ అదిరింది. ఇక అంజలి అమాయిక పాత్రలో  సీతమ్మను తలపించింది. సమంత చాలా అందం, అభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుతో  రొమాన్స్ లో తానేంటో నిరూపించింది. జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో తనదైన శైలి కనబరిచారు. జయసుధ, రావు రమేష్ , మురళి మోహన్, రోహిణి ,రవిబాబు, తనికెళ్ళ భరణి వారి వారి పరిధిమేరకు నటించిమెప్పించారు.
         సినిమాలో ముఖ్యంగా  అన్నదమ్ముల మధ్య బంధాన్ని.. తన మేనకోడలి మీద మామయ్యకి ఉన్న ప్రేమ, కొడుకు – తల్లి మధ్య అనురాగం మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటాయో బాగా తెరకెక్కించారు. ఫస్టాఫ్  మొత్తం మంచి వేగంగా సాగుతుంది. సెకండాఫ్ లో కథనం కాస్త మందగించినట్టు అనిపిస్తుంది. ఇక సాంగ్స్ విషయానికొస్తే  అన్ని పాటలను చాలా హ్రుద్యంగా తెరకెక్కించారు. వెంకీ-మహీ ఒకరిపైఒకరికి గల ప్రేమను చెప్పకనే చెప్పిన సన్నివేశం అందరి హ్రుదయాలను హత్తుకుంటుంది. ఆద్యంతం కథనం బోర్ కొట్టించకుండా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రక్తికట్టించాడనే చెప్పాలి.

సాంకేతిక విభాగం :
      ఇద్దరు పెద్ద హీరోలను హ్యాండిల్ చేయటం కత్తిమీద సమనే చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దహీరోలతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కించటంలో విజయం సాధించాడు.  సినిమాటోగ్రఫీ విషయంలో గుహన్ వందమార్కులు కొట్టేశాడు. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్ గా గుహన్ చిత్రీకరించాడు. ఆడియో రిలీజ్ తర్వాత  మిక్కీ జె మేయర్ పనితనం అందరికీ తెలిసిపోయింది, దీనికి ఏమాత్రం తగ్గకుండా సినిమాలోనూ సంగీతం చాలా ఆహ్లాదంగా ఉంది. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం సినిమాకి వెన్నెముకలా నిలిచింది.  ఎడిటింగ్  బాగుంది.   డైలాగ్స్ సందర్భోచితంగా ఉన్నాయి. క్వాలిటీ ఔట్ ఇవ్వటంలో టెక్కికల్ టీం చాలా శ్రద్ద తీసుకున్నట్టు కనిపించింది.
ముగింపు :

       ప్రతీ తెలుగువారింటా రంగవల్లులు కొలువుతీరే పెద్దపండుగ వేళ రావాల్సిన.. కుటుంభ సమేతంగా చూడాల్సిన... ఆప్యాయతానురాగాల సమాహారం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.

...avnk

No comments:

Post a Comment