Friday, 22 February 2013

Jabardasth Telugu Movie Review

jabardasth-review

సినిమా       : జబర్ దస్త్
నటీనటులు  : సిద్దార్థ్‌, సమంత, నిత్య మీనన్‌, శ్రీహరి, షాయాజీ షిండే, దర్మవరపు సుబ్రహ్మణ్యం, తాగుబోతు రమేష్ తదితరులు
దర్శకత్వం    : బి.వి.నందినీ రెడ్డి
నిర్మాతలు    : బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు
సంగీతం       : ఎస్.ఎస్. థమన్
సంస్థ          : శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌
విడుదల      : 22 పిభ్రవరి, 2013

 ‘అలా మొదలైంది ’ సినిమాతో దర్శకురాలిగా వెండితెరకు పరిచయం అయి, మొదటి సినిమాను తక్కువ బడ్బెట్ తో తీసి ఘన విజయం సాధించి అందరి ప్రశంసలు పొందిన లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి తన రెండవ సినిమాని నేడు ప్రేక్షకుల ముందు ఉంచారు. గత కొన్ని రోజుల నుండి టాలీవుడ్ దర్శకులకు రెండవ సినిమా అంతగా అచ్చిరాడం లేదు. ఇలాంటి గ్రాఫ్ టాలీవుడ్ లో చాలా మంది దర్శకులకు ఉంది. మరి ఆ దర్శకుల లిస్టులో నందినీ రెడ్డి చేరిందా లేక సేఫ్ జోన్ లోనే ఉందా అనేది జబర్ దస్త్ రివ్యూ చూసి నిర్ధారణకు వద్దాం.

కథ :
దొరికిన చోటల్లా అప్పులు చేయడం... ఆ తర్వాత ఏదో ఒక వ్యాపారం పెట్టడం... అందులో నష్టం రాగానే అక్కడ నుంచి ఉడాయించడం... అప్పుల వాళ్ళను తప్పించుకుని తిరగడం... ఇదీ బైర్రాజు (సిద్ధార్థ్‌) రోజువారీ జీవితం. ఒకసారి శ్రేయ (సమంతా) , బైర్రాజు అనుకోకుండా ఓ పెళ్లి వేడుకలో కలుసుకుంటారు. అక్కడ శ్రేయ బిజెనెస్ ఐడియాని గుట్టుగా వినేసి ఆమెకు రావాల్సిన జాబ్ కూడా కొట్టేస్తాడు. యాజమానితో గొడవ పడి అందులోనుండి బయటకు వచ్చి శ్రేయతో ఓ అవగాహనకొచ్చి ఒక ఈమెంట్ మేనేజ్ మెంట్ ని ప్రారంభించి, మంచి పొజిషన్ కి వచ్చిన తరువాత ఇద్దరి మద్య గొడవలు వచ్చి విడిపోతారు. మరి వీరిద్దరు చివరకు మళ్ళీ కలుస్తారా ? మధ్యలో నిత్యామీనన్ ప్రవేశిస్తుంది. వారిద్దరి స్టోరీ, నిత్యా స్టోరీ ఏంటనేది తెర పై చూడాల్సిందే.

కళాకారుల పనితీరు :
ఈ సినిమాలో సిద్దార్థ మాస్ క్యారెక్టర్ చేశాడు. కానీ క్యారెక్టర్ అతనికి ఏమాత్రం సూట్ కాలేదు. ముఖ్యంగా ఇందులో వేసుకున్న పూలచొక్కా కూడా. సిద్దార్థ లుక్ కి, ఫీచర్ కి సరిపోయే క్యారెక్టర్ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏదో దర్శకురాలు చెప్పినట్లు చేసుకుంటూ పోయాడంతే. ఇక సమంతా విషయానికి వస్తే ఈమె తమ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్రించింది కానీ, తెర పై ఏదో మిస్సయ్యినట్లు కనిపిస్తుంది. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన నిత్యామీనన్ కి హీరో హీరోయిన్ ల కంటే మంచి పాత్ర దొరికింది. ఈమెకు ఇచ్చిన క్యారెక్టర్ ని బాగా పండించింది. నిత్యకు మరోసారి మార్కులు పడ్డట్లే... ఈ సినిమాలో గెస్ట్ రోలు పోషించిన శ్రీహరి దావూద్ భాయ్ గా కాసేపు నవ్వించే ప్రయత్నం చెసినా... ఆయన చేసిన అతిథి పాత్రల్లో ఇది ఓ వృధా పాత్ర అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తాగుబోతు రమేష్. ఈయనకు కమేడియన్ గా బ్రేక్ ఇచ్చిన నందినీ రెడ్డి ఈ సినిమాలో మాత్రం సరైన పాత్ర ఇవ్వలేదు. ఇక మిగతా నటులు అంతంత మాత్రంగానే రాణించారు.

సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ఒకటి రెండు పాటలు తప్పితే మిగితావి పెద్దగా వినపొంపుగా లేదు. ఒకవేళ థమన్ బాగా చేద్దామన్న సినిమాలో స్టఫ్ లేకపోయే సరికి సంగీతం సోసోగా అనిపిస్తుంది. ఈ సినిమాకి ఫ్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటో గ్రఫీ. ఇక రచయిత వెలిగొండ శ్రీనివాస్ రాసిన సంభాషనలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. సినిమా మొత్తం నవ్వించడానికి ఎంత ప్రయత్నించినా ఆ సంభాషణలు పేలలేకపోయాయి. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి, ఇక నిర్మాణ చిత్రానికి తగ్గట్లు ఖర్చుపెట్టాడు. ఇక దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమాకి తన పూర్తి స్థాయి ఎఫర్ట్ పెట్టలేదని చెప్పవచ్చు. మొదటి సినిమాలో తనను తాను నమ్ముకొని మంచి కథతో సినిమా చేసింది. కానీ రెండో సినిమా వరకు వచ్చే వరకు కాపీ కథ పై ఆరారపడింది. ‘బ్యాండ్ బాజా భరత్ ’ సినిమాలోని కొంత స్టోరీని తీసుకొని, దానిని మన నేటివిటీకి అనుగుణంగా మార్చి తెర పై తన పేరును వేసుకుంది., పూర్తి స్థాయిలో కామిడీని నమ్ముకొని సినిమా చేసింది కానీ ఈ ప్లాన్ బెడిసికొట్టింది. కాపీ కొట్టడంలో కూడా కాస్తంత కళా పోషణ ఉండాలి. కానీ నందినీ రెడ్డికి అది రాలేదు.

విశ్లేషణ :
వినోదాత్మక కథలను ఎంచుకోవడం అటు దర్శకులకు, ఇటు నిర్మాతలకు, మరోపక్క నాయకానాయికలకు... ఇలా అందరికీ సేఫే. సినిమా బాగుందనే టాక్ వస్తే... వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ చూస్తారు. అయితే ఎంచుకున్న ఆ కథలో కాసింత కొత్తదనాన్ని చూపించాల్సిన బాధ్యతను మాత్రం మరవకూడదు. ప్రేక్షకుడిని సీట్లో ఖాళీగా ఉంచకుండా ప్రతి సన్నివేశంలోనూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. నందిని రెడ్డి తన తొలి చిత్రంలో అదే చేసింది. కానీ రెండో సినిమాకి వచ్చే సరికి కొంచెం నిర్లక్షం వహించినట్టు అనిపిస్తుంది. కథా నేపథ్యం కొత్తదే అయినా సన్నివేశాలు మాత్రం చాలా పాతవి. కొన్ని సన్నివేశాల్లో బలవంతంగా నవ్వించే ప్రయత్నానికి పూనుకున్నారు. ఇక ఈ సినిమాలో నందిని రెడ్డి సక్సెయి అయినది ఏదంటే నిత్యా మీనన్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. మొత్తంగా తనలో ఉన్న కొత్తదనం తొలి సినిమాతోనే అయిపోయిందేమో అనే సందేహం ప్రేక్షకుల్లో కలిగేలా చేసింది నందిని రెడ్డి.

చివరగా :
జబర్ దస్త్ ’ గా కూడా  కాపీ కొట్ట రాలేదు.












Tuesday, 19 February 2013

Mirchi Movie Review

 

mirchi-movie

సినిమా   : మిర్చి
బ్యానర్    : యువీ క్రియేషన్స్
దర్శకుడు : కొరటాల శివ
నిర్మాత   : వి. వంశి కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం  : దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు :ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాద్యాయ్మాస్

హీరోగా పేరుతెచ్చకున్న ప్రభాస్ తరువాత ట్రాక్ మార్చి మిస్టర్ ఫర్ పెక్టు సినిమాలో క్లాస్ గా కనిపించి క్లాస్ మాస్ హీరోగా పేరొందాడు. ఆ సినిమా తరువాత నుండి ప్రభాస్ కి సరైన హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచినా డీలా పడకుండా మిర్చి తో ఘాటెక్కించడానికి  రెడీ అయిపోయి, స్ర్కిప్టు రైటర్ గా ఉన్న కొరటాల శికకు దర్శకత్వం ఛాన్స్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు అని చూడకుండా అతని పై పూర్తి నమ్మకం పెట్టి, తన పని పూర్తి ఫర్ ఫెక్టుగా చేసుకొని పోయిన ప్రభాస్ ‘ మిర్చి ’సినీ ప్రేక్షకులకు ఘాటెక్కించిందో లేదో చూద్దాం.

కథ :
జై (ప్రభాస్‌)... ఇటలీలో ఆర్కిటెక్టర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. వీలైతే ప్రేమిద్దాం.. పోయేదేముంది అనే మనస్తత్వం కలవాడు. అక్కడే పరిచయం అయిన మానస (రిచా గంగోపాధ్యాయ) ప్రేమిస్తాడు. మానస కూడా జైని ప్రేమిస్తుంది.  అయితే మానన తమ ప్రేమకు అడ్డుగా నిలిచే తన ఫ్యాక్షన్ కుటుంబం గురించి జై కు వివరిస్తుంది. దాంతో... జై వెంటనే తట్టాబుట్టా సర్దుకుని... ఇండియా వచ్చేసి, ఆమె ఇంటిలో వాలిపోయి... ప్యాక్షన్ పగలతో రగిలిపోతున్న వారి కుటుంబాన్ని చక్కబెట్టే పనిలో పడతాడు. ఆ క్రమంలో అతని గురించి ఓ నిజం ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇంతకీ జై ఆ ఇంటికి వచ్చింది.. తన ప్రేమ కోసం కాదు.. మరొక పనిమీద అని.. ఇంతకీ ఆ పని ఏమిటి... ఇంతకీ జై ఎవరు...మరో హీరోయిన్ వెన్నెల (అనుష్క) లతో జైకి ఉన్న బంధమేమిటి ? వాళ్లిద్దరిలో ఎవరిని దక్కించుకుంటాడు ? అనే  విషయాల్ని తెరపైనే చూడాలి.

కళాకారుల పనితీరు :
ఇంత వరకు మాస్ సినిమాలు చేసి మధ్యలో క్లాస్ మళ్లీ మాస్ సినిమాలు చేసిన ప్రభాస్ ఈ సినిమాలో కాస్త డిఫరెంటు క్యారెక్టర్ ని పోషించాడు. ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసాడు. సినిమా అంతా న్యూ లుక్ తో బావున్నాడు. ఈ చిత్రం ద్వితియార్థంలో ప్రభాస్ చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. యాక్షన్ సీన్స్ లో అదుర్స్ అనిపించాడు. సెకండాఫ్ ని మొత్తం ప్రభాస్ పే తన భుజస్కందాల పై వేసుకొని నడిపించాడు. ఇక చాలా రోజుల తరువా ప్రభాస్ ప్రక్కన జోడి కట్టిన అనుష్క ఫేసులో చాలా తేడా వచ్చింది. కాస్తంత ముదురు ముఖం పడినట్లు కనిపించింది. రిచా గంగోపాధ్యాయ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈమెకు అనుష్కంత లెన్తీ పాత్ర దొరికింది. ఉన్నంతలో ఫర్వాలేదనిపించినా, నటనలో ఇంకా పరిణితి చెందాలి. ప్రభాస్ తండ్రిగా సత్యరాజ్ బాగానే చేసినా, ఇతని స్థానంలో వేరే వారు ఉంటే ఇంకా బాగుండేదేమో, నదియా చిన్న పాత్రే అయినా బాగానే చేసింది. ఇప్పటికీ ఆమెలో ఏ మాత్రం అందం తగ్గలేదు. వీర ప్రతాప్ పాత్రలో బ్రహ్మానందం ఒకటి రెండు సన్నివేశాల్లో మాత్రం నవ్వించాడు. సంపత్, నాగినీడు, ఆదిత్య, సుబ్బరాజు, అజయ్, సుప్రీత్ అందరూ పాత్ర పరిధి మేరకు చేసారు .

సాంకేతిక విభాగం :
ఈ సినిమా ముఖ్యంగా బలం మ్యూజిక్. దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు జనాల్లో మంచి క్రేజ్ ని సంపాదించాయి. కొన్ని సాంగులు అయితే ప్రభాస్ అన్ని సినిమాల్లో కన్నా బెస్ట్ గా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో ప్రభాస్ యాక్షన్ సీన్స్ కి దేవీ అందించిన బ్యాగ్రౌండ్ స్కోరు మరింత బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.... మది చాలా బాగా చిత్రీకరించాడు. ప్రభాస్ అంత చక్కగా కనిపించడానికి కారణం కూడా ఇదే కారణం. ఇక నిర్మాతలు క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. ఇక రైటర్ నుండి దర్శకుడి అవతారం ఎత్తిన కొరటార శివ తన తొలి ప్రయత్నంలో పూర్తి విఫలం కాకుండా ఫర్వాలేదనిపించాడు. సినిమా మొదటి భాగంలో బోర్ కొట్టించినా సెకండాఫ్ లో మాత్రం పరుగులు పెట్టించాడు. డైరెక్టర్ గా తొలి ప్రయత్నంలో సక్సెస్ అయిన కొరటాల శివ, కొన్ని లోటు పాట్లను తెలుసుకుంటే భవిష్యత్తులో మంచి దర్శకుడిగా పేరు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

విశ్లేషణ :
రెబల్ తరువాత వచ్చిన ఈ సినిమా మొత్తంగా క్లాస్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నదని చెప్పవచ్చు. చెప్పాలంటే ప్రభాస్ తన పూర్తి స్థాయి నటనను ప్రదర్శించి ఈ సినిమాని నిలబెట్టాడు. రొటీన్ స్టోరీలను ఎన్నుకొని, ఎలా ప్రారంభించిలో తెలియకుండా కొరటాల శివ మొదట్లో కఫ్యూజన్ కి గురయ్యాడు. మొదటి భాగంలో వచ్చే సీన్స్ మరీ బోర్ కొట్టించే విధంగా ఉండటంతో ప్రేక్షకులను సినిమా సెకండాఫ్ కూడా ఇలానే ఉంటుందనే ఫీలింగ్ రప్పించాడు. కానీ సెకండాఫ్ లో సినిమా రూపురేఖలనే మార్చి సినిమాకి ప్రాణం పోశాడు. స్టోరీలో బలం లేకపోవడంతో, మళ్ళీ మొదటి సారి మెగా ఫోన్ పట్టడంతో చాలా ప్రెషర్ కి గురయినా మొత్తానికి సినిమాని గాడిలో పెట్టాడు. ఇక ప్రభాస్ కాబట్టి ఈ సినిమా కమర్షియల్ గా దూసుకుపోవచ్చు. దానికి తోడు ఇప్పట్లో ఏ సినిమాలు లేవు కాబట్టి ప్రొడ్యూసర్లు కూడా సేఫ్ జోన్ లో ఉండవచ్చు.

చివరగా :
గుంటూరు మిర్చి అంత ఘాటు లేకపోయినా టేస్టీగానే ఉంది.

 

Friday, 1 February 2013

Kadali Movie Review

kadal
సినిమా : కడలి
విడుదల తేదీ : 1 ఫిబ్రవరి 2013
దర్శకుడు : మణిరత్నం
నిర్మాత : మణిరత్నం, ఎ. మనోహర్ ప్రసాద్
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
నటీనటులు : గౌతమ్, తులసి, అర్జున్, అరవింద్ స్వామి
ప్రేమ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం చాలా రోజుల గ్యాప్ తరువాత కొత్త నటీనటులను పెట్టి మరో ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాడు. రావన్ పరాజయం తరువాత ఇంత కాలం గ్యాప్ తీసుకున్న ఆయన తన సొంత నిర్మాణంలో, చాలా మంది ప్రముఖులను పెట్టి కడలి చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను సముద్రం అలలలాగా అలరించిందో లేదో చూద్దాం.

కథ :
సామ్ ఫెర్నాండెజ్ (అరవింద స్వామి) సిన్సియర్‌గా అంకిత భావంతో ఉండే వ్యక్తి. బెర్గ్‌మెన్స్(అర్జున్) ఫన్నీగా ప్రేమ తత్వంతో ఉండే వ్యక్తి. వీరిద్దరు చర్చి‌ఫాదర్‌గా శిక్షణ కోసం క్రిస్టియన్ సెమినార్‌కు వెలుతారు. అయితే తర్వాత ఇద్దరు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటారు. సామ్ సముద్రం పక్కన ఉండే ఓ గ్రామానికి వచ్చి చర్చి ఫాదర్‍‌గా జీవితం మొదలు పెడతాడు. అక్కడే అతడికి తల్లిని కోల్పోయి అనాథ బాలుడైన థామస్‌(గౌతం)తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పెరిగి పెద్దవాడైన థామస్ బెర్గ్‌మెన్స్ కూతురు బిట్రిస్(తులసి)తో ప్రేమలో పడతాడు. ఆథామస్, బీట్రిస్ మధ్య ప్రేమ ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే తెర పై చూడాల్సిందే.

కళాకారుల పని తీరు :
ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన అరవింద్ స్వామి, అర్జున్ లు ఈ సినిమాకి హైలెట్. సినిమా మొత్తంలో వీరిద్దరి నివిడి ఎక్కువగా ఉంటుంది. చాలా సంవత్సరాల తరువాత అరవింద్ స్వామి తెర పై కనిపించాడు. అప్పుడు ఎలా చేశాడో, ఇప్పుడు కూడా అంతే అద్బుతంగా చేశాడు. ఇక అర్జున్ కూడా తన పాత్రకి ప్రాణం పోశాడని చెప్పవచ్చు. ఇక అర్జున్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం హైలెట్ . ఇక వీరిద్దరి సంగతి ప్రక్కన పెడితే కొత్తగా వెండితెరకు తెరంగ్రేటం చేసిన కార్తీక్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక రాధ కూతురు తులసి.... ఈమె పాత్ర తక్కువ సేపు ఉన్నా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. నటనలో ఇంకా పరిపూర్ణత సాధించాల్సి ఉంది. లక్ష్మి మంచు చాలా చిన్న పాత్ర చేసి ఓకే అనిపించుకుంది .

సాంకేతిక వర్గం :
ఇక మణిరత్నం సినిమా అంటే మనకు ముందు గుర్తుకు ఏఆర్ రహమాన్ సంగీతం. ఈయనతో పన్నెండు సినిమాలకు పని చేయించుకున్న మణిరత్నం ఇందులో కూడా ఇతనితోనే సంగీతం చేయించాడు. ఈ సినిమాకి సంగీతం ఓ బలంగా చెప్పవచ్చు. కానీ ఈ సినిమాలోని కొన్ని పాటలు ప్రేక్షకులకు చేరాలంటే మరి కొంత సమయం పట్టవచ్చు. ఇక ప్రముఖ సినిమాటోగ్రఫర్ అయిన రాజీవ్ మీనన్ ఫోటోగ్రఫి చాలా అద్బుతంగా ఉంది. ముఖ్యంగా సముద్ర తీరాన్ని తీయన చిత్రీకరించిన తీరు మనల్ని తన్మయత్వానికి గురిచేస్తుంది. సంభాషణలు అంత పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.

విశ్లేషణ :
మణిరత్నం గతంలోని ప్రేమ కథా చిత్రాలను ఈ చిత్రంలో సరిపోల్చ కూడదు. ఎందుకంటే అన్ని ప్రేమ కథా చిత్రాలే అయినా దేని ప్రత్యేకత దానిదే. ఆయన గత సినిమాలు స్లోగా ఉంటాయి. కానీ కడలి కధని మరి కొద్దిగా స్లోగా నడిపించాడు. ఇదే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టవచ్చు. ఇక కొత్తగా తెరంగ్రేటం చేసిన గౌతమ్, తులసిల ప్రేమ కథను చాలా తక్కువగా పెట్టాడు. దీంతో యువతరాన్ని కొద్దిగా ఆకట్టుకోపోవచ్చు. తులసి కూడా హైప్ ఇచ్చినంత లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. మణిరత్నం సినిమాల్లో ఉండే మేజిక్ కొద్దిగా మిస్ అయినట్లు అనిపిస్తుంది. అర్జున్, అరవింద్ స్వమి మధ్య వివాదాన్నే ఎక్కువ చూపించాడు.  ఫస్ట్ హాఫ్ కొంత ఆసక్తికరంగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ బోర్ కొట్టించింది. రెగ్యులర్ సినిమా లవర్స్ కోరుకునే అంశాలు ఏమీ ఇందులో లేవు. మణిరత్నం సినిమాలు ఇష్టపడే వారు కడలి కూడా అంతగా ఊహించి వెళ్ళకుండా, ఓ కొత్త ప్రేమ కథను చూసేందుకు వెళితే బాగుందనిపిస్తుంది.

చివరగా :
సముద్రంలోని అలల అంత ఫాస్టుగా ‘కడలి ’ఈ సినిమా లేదు.

Ongole Gitta Review

ongole-gitta
సినిమా : ఒంగోలు గిత్త
విడుదల తేదీ : 1 ఫిబ్రవరి 2013 (శుక్రవారం)
దర్శకుడు : భాస్కర్ (బొమ్మరిల్లు)
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్, మణిశర్మ
నటీనటులు : రామ్, కృతి కర్భంద, ప్రకాష్ రాజ్, ఇతర తారాగణం.
బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు తరువాత పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం ఎవరికి అర్థం కాకుండా తీసి పలు విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు ఈ సారి తన పంథాని మార్చి మాస్ సినిమాని ఎనర్జిటిక్ హీరో రామ్ ని పెట్టి తీశాడు. మరి ఇతను తీసిన ‘ఒంగోలు గిత్త ‘ సినిమాలో ఒంగోలు గిత్తకు ఉన్న పవర్ ఉందో లేదో ఓ సారి చూద్దాం.

కథ :
చిన్న వయసులో లోనే ఇంట్లో నుండి పారిపోయి, గుంటూరు మిర్చి యార్డుకు  చేరుకుంటాడు వైట్ (హీరో రామ్). అక్కడ చిన్నగా వ్యాపారం మొదలు పెట్టి,  మిర్చి యార్డ్ లో నాలుగు షాపులకు ఓనర్ అవుతాడు. మిర్చి యార్డుకు చైర్మెన్ గా ఆదికేశవులు (ప్రకాష్ రాజ్) ఉంటాడు. అతను చాలా మంచి వాడు. మిర్చి యార్డ్ అడుగు పెట్టినప్పటి నుండి  చైర్మెన్ పదవి పై కన్నేస్తాడు. కానీ స్థానిక ఎమ్మెల్యే (ఆహుతి ప్రసాద్ ) మిర్చియార్డును అక్కడి నుండి తరలించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కథంతా నడుస్తుంటుంది. చైర్మెన్ తో వైట్ కి ఉన్న సంబంధం ఏమిటి ? హీరో చైర్మెన్ పదవి దక్కించుకుంటాడా ? అనేది తెరపై చూడాలి.

కళాకారుల పనితీరు :
ఈ చిత్రంతో కొత్త బిరుదు (ఎనర్జిటిక్ స్టార్ ) గా పేరు తెచ్చుకున్న హీరో రామ్ తన పాత్రల వరకు అన్నీ ఎనర్జిటిక్ గానే చేసుకుంటూ పోయాడు. డాన్స్ లు కూడా బాగానే చేసుకుంటూ పోయాడు. కానీ కథలు సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం బోల్తా పడుతున్నాడు. ఇక ఇతనికి జోడిగా నటించిన  కృతి కర్బంధ అమాయకురాలిగా, హీరో టార్చర్ బరించే పాత్రలో ఫర్వాలేదనిపించింది. అలాగే పాటల్లో గ్లామర్ గా, చూడటానికి చాలా అందంగా ఉంది. ఇక మార్కెట్ ఛైర్మెన్ గా ప్రకాష్ రాజ్ కొత్తగా, నీట్ గా కనిపించాడు. కిషోర్ దాస్ కామెడీ బాగుంది.  రామ్, అలీ, హీరోయిన్ ఫ్యామిలీ మధ్య జరిగే కామెడీ ఫర్వాలేదనిపిస్తాయి. ఇక మిగిలిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు.

సాంకేతిక విభాగం :
తనకు కిక్ కావాలని రూటు మార్చిన భాస్కర్ మాస్ సినిమా తీయాలనుకొని డిసైడ్ అయ్యి రాసుకున్న కథలో దమ్ములేదు. దానికి తోడు ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ అందించిన స్వరాలు ఏ మాత్రం వినసొంపుగా అనిపించవు. మ్యూజిక్ విషయంలో ఏ మాత్రం రాజీ పడని భాస్కర్ మరి ఇలాంటి పాటలు ఎందుకు చేయించుకున్నాడో అర్థం కావడం లేదు. ఈ చిత్రానికి సురేంద్ర క్రిష్ణ అందించిన సంభాషణలు కథలో బలం లేకపోవడంతో అవి కూడా ఆకట్టుకోలేక పోయాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీలు చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి.

విశ్లేషణ :
మాస్ ని నమ్ముకొని భాస్కర్ రాసుకున్న కథలో దమ్ము లేక పోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు రొటీన్ కథలాగే ఉన్నా, ఇందులో అతను కొత్తగా చూపించింది, చూపించడానికి ఏమీ లేదు. ఓ కథని తీసుకొని దానికి మిర్చి యార్డ్ అనే కొత్త నేపధ్యాన్ని చేర్చి సినిమా తీసేశాడు. భాస్కర్ కథానుసారంగానే ప్రకాష్ రాజ్ న్యూడ్ సీన్స్ పెట్టామని చెప్పుకొచ్చాడు. కానీ కథానుసారం అయితే ఆ సీన్స్ అవసరమే లేదు, ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీశానడం కంటే తమిళంలో ఎలా అతి చేసి సన్నివేశాలను చూపిస్తారో అలా చూపించాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా తను రాసుకున్న కథలో మిర్చి యార్డుకి, హీరో రివేంజ్ కి ముట్టే ప్రయత్నం అసలు ఫలించలేదు. ఒక్కోసారి ఈ సినిమా చూస్తుంత సేపు దర్వకుడు రాసుకున్న కథకు, తీసిన సీన్లకు సంబంధం లేకుండా తీశాడా అని, సుత్తి ఎక్కువ పెట్టి, సబ్జెక్టు లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందో దీని ద్వారా కొంత అర్థం అవుతుంది. సినిమాలో విలనిజంకి చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ దాన్ని ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ భాస్కర్ పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే అభిమన్యు సింగ్, అజయ్, ప్రభు లాంటి పెద్ద నటులు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేకపోవడమే కాకుండా అభిమన్యు సింగ్ ది విలన్ పాత్ర అని చెప్పుకోవడం కంటే తనదో జోకర్ పాత్ర అని చెప్పుకోవచ్చు. ఇక సినిమా మొదటి అరగంట బాగానే అనిపించినా... తరువాత ట్రాక్ తప్పి ఎక్కడికో వెళ్లి పోతుంది. దాంతో ఇంటర్వల్ ఎప్పుడు వస్తుందా ? వెళ్ళి ఓ దమ్ము కొట్టి వెళ్లి రిలాక్స్ అవుదాం అనుకుంటాడు సదరు ప్రేక్షకుడు. . ఇక సెకండాఫ్ విషయానికొస్తే మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ తప్పితే మిగతా ఆకట్టుకునే సీన్స్ ఏమీ లేవు. సెకండాఫ్, క్లైమాక్స్ అంతా ముందుగానే ఆడియన్స్ కి తెలిసిపోతుంది.

చివరగా :
ఒంగోలు గిత్త పస లేని ‘గిత్త ’