సినిమా : ఒంగోలు గిత్త
విడుదల తేదీ : 1 ఫిబ్రవరి 2013 (శుక్రవారం)
దర్శకుడు : భాస్కర్ (బొమ్మరిల్లు)
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్, మణిశర్మ
నటీనటులు : రామ్, కృతి కర్భంద, ప్రకాష్ రాజ్, ఇతర తారాగణం.
బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు తరువాత పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం ఎవరికి అర్థం కాకుండా తీసి పలు విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు ఈ సారి తన పంథాని మార్చి మాస్ సినిమాని ఎనర్జిటిక్ హీరో రామ్ ని పెట్టి తీశాడు. మరి ఇతను తీసిన ‘ఒంగోలు గిత్త ‘ సినిమాలో ఒంగోలు గిత్తకు ఉన్న పవర్ ఉందో లేదో ఓ సారి చూద్దాం.
కథ :
చిన్న వయసులో లోనే ఇంట్లో నుండి పారిపోయి, గుంటూరు మిర్చి యార్డుకు చేరుకుంటాడు వైట్ (హీరో రామ్). అక్కడ చిన్నగా వ్యాపారం మొదలు పెట్టి, మిర్చి యార్డ్ లో నాలుగు షాపులకు ఓనర్ అవుతాడు. మిర్చి యార్డుకు చైర్మెన్ గా ఆదికేశవులు (ప్రకాష్ రాజ్) ఉంటాడు. అతను చాలా మంచి వాడు. మిర్చి యార్డ్ అడుగు పెట్టినప్పటి నుండి చైర్మెన్ పదవి పై కన్నేస్తాడు. కానీ స్థానిక ఎమ్మెల్యే (ఆహుతి ప్రసాద్ ) మిర్చియార్డును అక్కడి నుండి తరలించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కథంతా నడుస్తుంటుంది. చైర్మెన్ తో వైట్ కి ఉన్న సంబంధం ఏమిటి ? హీరో చైర్మెన్ పదవి దక్కించుకుంటాడా ? అనేది తెరపై చూడాలి.
కళాకారుల పనితీరు :
ఈ చిత్రంతో కొత్త బిరుదు (ఎనర్జిటిక్ స్టార్ ) గా పేరు తెచ్చుకున్న హీరో రామ్ తన పాత్రల వరకు అన్నీ ఎనర్జిటిక్ గానే చేసుకుంటూ పోయాడు. డాన్స్ లు కూడా బాగానే చేసుకుంటూ పోయాడు. కానీ కథలు సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం బోల్తా పడుతున్నాడు. ఇక ఇతనికి జోడిగా నటించిన కృతి కర్బంధ అమాయకురాలిగా, హీరో టార్చర్ బరించే పాత్రలో ఫర్వాలేదనిపించింది. అలాగే పాటల్లో గ్లామర్ గా, చూడటానికి చాలా అందంగా ఉంది. ఇక మార్కెట్ ఛైర్మెన్ గా ప్రకాష్ రాజ్ కొత్తగా, నీట్ గా కనిపించాడు. కిషోర్ దాస్ కామెడీ బాగుంది. రామ్, అలీ, హీరోయిన్ ఫ్యామిలీ మధ్య జరిగే కామెడీ ఫర్వాలేదనిపిస్తాయి. ఇక మిగిలిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు.
సాంకేతిక విభాగం :
తనకు కిక్ కావాలని రూటు మార్చిన భాస్కర్ మాస్ సినిమా తీయాలనుకొని డిసైడ్ అయ్యి రాసుకున్న కథలో దమ్ములేదు. దానికి తోడు ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ అందించిన స్వరాలు ఏ మాత్రం వినసొంపుగా అనిపించవు. మ్యూజిక్ విషయంలో ఏ మాత్రం రాజీ పడని భాస్కర్ మరి ఇలాంటి పాటలు ఎందుకు చేయించుకున్నాడో అర్థం కావడం లేదు. ఈ చిత్రానికి సురేంద్ర క్రిష్ణ అందించిన సంభాషణలు కథలో బలం లేకపోవడంతో అవి కూడా ఆకట్టుకోలేక పోయాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీలు చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి.
విశ్లేషణ :
మాస్ ని నమ్ముకొని భాస్కర్ రాసుకున్న కథలో దమ్ము లేక పోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు రొటీన్ కథలాగే ఉన్నా, ఇందులో అతను కొత్తగా చూపించింది, చూపించడానికి ఏమీ లేదు. ఓ కథని తీసుకొని దానికి మిర్చి యార్డ్ అనే కొత్త నేపధ్యాన్ని చేర్చి సినిమా తీసేశాడు. భాస్కర్ కథానుసారంగానే ప్రకాష్ రాజ్ న్యూడ్ సీన్స్ పెట్టామని చెప్పుకొచ్చాడు. కానీ కథానుసారం అయితే ఆ సీన్స్ అవసరమే లేదు, ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీశానడం కంటే తమిళంలో ఎలా అతి చేసి సన్నివేశాలను చూపిస్తారో అలా చూపించాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా తను రాసుకున్న కథలో మిర్చి యార్డుకి, హీరో రివేంజ్ కి ముట్టే ప్రయత్నం అసలు ఫలించలేదు. ఒక్కోసారి ఈ సినిమా చూస్తుంత సేపు దర్వకుడు రాసుకున్న కథకు, తీసిన సీన్లకు సంబంధం లేకుండా తీశాడా అని, సుత్తి ఎక్కువ పెట్టి, సబ్జెక్టు లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందో దీని ద్వారా కొంత అర్థం అవుతుంది. సినిమాలో విలనిజంకి చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ దాన్ని ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ భాస్కర్ పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే అభిమన్యు సింగ్, అజయ్, ప్రభు లాంటి పెద్ద నటులు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేకపోవడమే కాకుండా అభిమన్యు సింగ్ ది విలన్ పాత్ర అని చెప్పుకోవడం కంటే తనదో జోకర్ పాత్ర అని చెప్పుకోవచ్చు. ఇక సినిమా మొదటి అరగంట బాగానే అనిపించినా... తరువాత ట్రాక్ తప్పి ఎక్కడికో వెళ్లి పోతుంది. దాంతో ఇంటర్వల్ ఎప్పుడు వస్తుందా ? వెళ్ళి ఓ దమ్ము కొట్టి వెళ్లి రిలాక్స్ అవుదాం అనుకుంటాడు సదరు ప్రేక్షకుడు. . ఇక సెకండాఫ్ విషయానికొస్తే మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ తప్పితే మిగతా ఆకట్టుకునే సీన్స్ ఏమీ లేవు. సెకండాఫ్, క్లైమాక్స్ అంతా ముందుగానే ఆడియన్స్ కి తెలిసిపోతుంది.
చివరగా :
ఒంగోలు గిత్త పస లేని ‘గిత్త ’
No comments:
Post a Comment